తమిళనాడుకు చెందిన ఓ రైతు ఎడారి గులాబీ మొక్కలను పెంచుతూ మంచి లాభాలను గడిస్తున్నారు. ఏటా రూ.50లక్షలు నుంచి రూ.60 లక్షల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. ఒక్కో మొక్కను రూ.12లక్షలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. అసలు ఎడారి గులాబీ మొక్కకు ఎందుకు అంత ధర? రైతు మొక్కల సాగులో అవలంభిస్తున్న విధానాలు ఏంటో మీరు చదవండి.

40 ఏళ్ల క్రితం సాగు ప్రారంభం
తిరువల్లూర్లోని ఈసనమ్ కుప్పంకు చెందిన జలంధర్ అనే రైతు 40 ఏళ్ల క్రితం ఎడారి గులాబీ మొక్కల సాగును ప్రారంభించారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ మొక్కలను పెంచుతున్నారు. మొత్తం 450 రకాల మొక్కలను సాగు చేస్తున్నాడు. ప్రతి ఎడారి గులాబీ మొక్క మూడు వేర్వేరు రకాల పువ్వులను పూస్తోంది.
‘రూ.12 లక్షలకు ఒక మొక్క అమ్మకం’
“చిన్న వేర్లు ఉన్న మొక్కలు రూ.150కు అమ్ముతాం. మందపాటి వేర్లు ఉన్నవి రూ. 12 లక్షల వరకు అమ్ముడుపోతాయి. ఈ ఎడారి గులాబీ మొక్కలు ప్రపంచంలోని మూడు ప్రదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. చెన్నై, వియత్నాం, థాయిలాండ్లో మాత్రమే లభిస్తాయి. రూ.12 లక్షలకు అమ్ముడయ్యే మందపాటి వేర్లు కలిగిన ఎత్తైన మొక్కలు చెన్నైలో దొరుకుతాయి. మొక్కలు నాటిన మొదటి 20 ఏళ్లు ఎటువంటి లాభాలు లేవని తెలిపారు. తాను పెంచిన మొక్కలు కేరళ, గుజరాత్, దిల్లీ వంటి రాష్ట్రాలకు, దుబాయ్ వంటి అరబ్ దేశాలకు ఎగుమతి అవుతాయని పేర్కొన్నారు.”అంటుకట్టడం ద్వారా ఒకే మొక్కపై బహుళ వర్ణ పువ్వులు వికసిస్తాయి. నేను ప్రస్తుతం ఎడారి గులాబీ మొక్కల పెంపకం ద్వారా ఏటా రూ. 50- రూ. 60 లక్షల వరకు సంపాదిస్తున్నాను. వీటి పెంపకానికి ఎక్కువ నీరు అవసరం లేదు అని రైతు జలంధర్ చెప్పారు.