నాగర్‌కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో పాలమూరు ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 1951 మే 22న పాలమూరు జిల్లా ఇటిక్యాలలో జన్మించిన జగన్నాథం మెడిసిన్ చదివి డాక్టరుగా కొంతకాలం ప్రజలకు వైద్యసేవలు అందించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన వృత్తిని ప్రజాసేవగా మార్చుకున్నారు. ప్రజలకు చేరువైన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
1996, 1999, 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు. అయితే, 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. 2014లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఆయన తర్వాత రాజకీయాలలో తగ్గుముఖం పట్టారు. ఇటీవల 2024 ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ పార్టీలో చేరినప్పటికీ ఆయన రాజకీయంగా పెద్దగా చురుకుగా లేకపోవడం గమనార్హం. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మరణించడంతో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.
మందా జగన్నాథం తన రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదలు, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆయన మరణం పాలమూరు జిల్లా ప్రజలకు తీరనీయని లోటు.