ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ పలు కీలక మైలురాళ్లు దాటిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన్ని పంచాయతీ రాజ్ శాఖ విజయాలను వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనతో పోలిస్తే ఎన్డీయే ప్రభుత్వం తక్కువ కాలంలోనే విశేష విజయాలు సాధించిందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రకారం, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 1800 కి.మీ సీసీ రోడ్లను నిర్మించగా, ఎన్డీయే ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే 3750 కి.మీ రోడ్లను నిర్మించింది. గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ఎన్డీయే హయాంలో వేగవంతంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
అదేవిధంగా, మినీ గోకులాల ఏర్పాటులోనూ ఎన్డీయే ప్రభుత్వం విశేష పురోగతి సాధించింది. వైసీపీ ప్రభుత్వం మొత్తం 268 మినీ గోకులాలను ఏర్పాటు చేస్తే, ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటివరకు 22,500 మినీ గోకులాలను స్థాపించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన వివరించారు. మరింతగా, ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (PVTG) ఆవాసాల కోసం ఎన్డీయే ప్రభుత్వం వైసీపీతో పోలిస్తే అత్యధిక నిధులను వెచ్చించింది. వైసీపీ ఐదేళ్లలో రూ.91 కోట్లు వెచ్చిస్తే, ఎన్డీయే ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే రూ.750 కోట్లను ఈ ప్రాజెక్టులకు కేటాయించిందని పవన్ తెలిపారు.
పంచాయతీ రాజ్ శాఖలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతికి దోహదపడ్డాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం తక్కువ కాలంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట వేసిందని తెలిపారు. ఈ విజయాలను ప్రజలకు వివరిస్తూ ఆయన ప్రభుత్వ విధానాలపై విశ్వాసం వ్యక్తం చేశారు.