సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు.
అలాగే కాంగ్రెస్‌లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉంటుందని తెలిపారు పీసీసీ చీఫ్. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నామని.. సంకాంత్రి తర్వాత చేరికలు ఉంటాయని వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామన్నారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. కార్పోరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
కాగా.. గత కొద్దినెలలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో చర్చలు కూడా జరిపారు.
అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేవంత్ పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందని కాంగ్రెస్ వర్గాలే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.