ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలో నిత్యం తిరుగుతున్న కొన్ని రైళ్లను రద్దుచేసి కుంభమేళాకు పంపిస్తోంది. 07657 తిరుపతి – హుబ్లీ, 07658 హుబ్లీ – తిరుపతి రైలును రెండునెలలపాటు అధికారులు రద్దు చేశారు. దీంతోపాటు తిరుపతి నుంచి కదిరిదేవరపల్లి వరకు, కదిరిదేవరపల్లి నుంచి తిరుపతికి నడిచే రైలును, గుంతకల్లు నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి గుంతకల్లుకు నడిచే రైళ్లను కూడా రద్దు చేశారు. డిసెంబరు 28వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ రైళ్లను కుంభమేళాకు పంపిస్తున్నారు.
అధికారుల నిర్ణయంపై విమర్శలు
అధికారులపై ప్రయాణికుల విమర్శలు ప్రధానంగా తిరుపతి-హుబ్లీ రైలు రద్దుచేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలు నిత్యం రాకపోకలు సాగించేందుకు ఈ రైలు ఉపయోగపడుతోంది. ఇది ప్యాసింజర్ రైలు కావడంతోపాటు ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న 62 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉంది.
తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు చిత్తూరు, కడప, అనంతపురం ఉమ్మడి జిల్లాలమీదుగా ప్రయాణించి హుబ్లీ చేరుకుంటుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ రైలు ఎంతో వెసులుబాటు కల్పిస్తోంది. ఇప్పుడు రెండునెలలు దీన్ని రద్దుచేయడంపై నిత్యం ప్రయాణించేవారు అధికారుల తీరుపై విమర్శలు చేస్తున్నారు.
ప్రయాణికులు సహకరించాలి
కుంభమేళాకే కేంద్రం ప్రాధాన్యం కుంభమేళాకు ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారికి ఇక్కట్లు ఉండకూడదనే ఉద్దేశంతో వీటిని రద్దుచేసి అక్కడకు పంపిస్తున్నామని, తిరిగి రెండు నెలల తర్వాత ఇవి అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని అర్థం చేసుకొని అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.
ఈ రెండు నెలలు ఈ మార్గంలో నడుస్తున్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అయితే ప్రయాణికులు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు. స్థానిక ఎంపీని కలవడంద్వారా రైల్వేశాఖ మంత్రితో మాట్లాడి వీటిని నడిపించేలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.