హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖలు భేటి అయ్యారు. సంధ్యా థియేటర్ వివాదం .. అల్లు అర్జున్ అరెస్ట్ .. బెనిఫిట్ షో లు – టికెట్ ధరల పెంపు పైన ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు సినీ ఇండస్ట్రీ సీఎం ముందుకు వచ్చింది. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని సినీ పెద్దలు హామీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో సినీ పరిశ్రమ సహకరించాలి.
ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడాన్ని తమ ప్రభుత్వం సీరియస్ తీసుకుందన్నారు. అందుకే తమ ప్రభుత్వం బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలను రద్దు చేసిందని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు. ఈ భేటీలో సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వాలని సీఎం రేవంత్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సీఎం రేవంత్ నో చెప్పారట. తాను అసెంబ్లీ వేదికగా బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు లేవని ప్రకటన చేశానని దానికే కట్టుబడి ఉన్నానని సినీ ప్రముఖులకు రేవంత్ చెప్పినట్లు సమాచారం.
ఈ సమావేశంలో ప్రముఖ దర్శకుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మమ్మల్ని బాగా చూసుకుంటోంది. దిల్ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్‌లు ఉన్నాయి. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్‌లో చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నామని ఆయన అన్నారు.
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలి. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుంది. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని ఆయన తెలిపారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సీఎం రేవంత్‌కు సూచించారు. నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని చూస్తున్నానని, హైదరాబాద్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాలని శ్యాంప్రసాద్ రెడ్డి కోరారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ ఉండాలని నిర్మాత సురేష్ బాబు కోరారు. నెట్‌ఫిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్‌గా ఉండాలని పేర్కొన్నారు.
మురళీమోహన్ మాట్లాడుతూ.. ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్‌డే ఉంటుంది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది. సినిమా రిలీజ్‌లో కాంపిటిషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల.. ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామన్నారు.
ఇక..సినిమా ప్రమోషన్స్ సమయంలో పోలీసులు అనుమతి నిరాకరిస్తే దాని పాటించాలని తెలంగాణ పోలీసులు సూచించారు. పోలీసులు అన్ని రకాల ఆలోచించే అనుమతి ఇవ్వలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పోలీసులు నిర్ణయాన్ని గౌరవించాలని డీజీపీ టాలీవుడ్ పెద్దలను కోరారు. బౌన్సర్లు నియమించుకున్నప్పుడు న్యాయ సమ్మతం ఉండాలన్నారు. ఏ ఈవెంట్ కైనా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, అన్ని పరిశీలించిన తరువాతే పోలీసులు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.