శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు యూసుఫ్గూడ 1వ బెటాలియన్ గ్రౌండ్స్‌లో బాలకృష్ణ తాజా చిత్రం ‘దాకు మహరాజ్‘ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండటంతో, ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోట్ల విజయభాస్కర్ (కేవీబీఆర్) స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మార్పులు ఉంటాయి.
ఈ ఈవెంట్ కారణంగా కేవీబీఆర్ స్టేడియం సమీపంలో అధిక రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. వాహనదారులు తమ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ క్రింది మార్గాలను అనుసరించాలని సూచించారు:
- జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుండి కేవీబీఆర్ స్టేడియం వైపు వెళ్లే వాహనాలు: క్రిష్ణానగర్ వద్ద నుండి శ్రీనగర్ కాలనీ-పుంజగుట్ట వైపు మళ్లిస్తారు.
- మైత్రీవనం జంక్షన్ నుండి బోరబండ బస్ స్టాప్ వైపు వెళ్లే ట్రాఫిక్: క్రిష్ణకాంత్ పార్క్-జీటీఎస్ టెంపుల్-కల్యాణ్ నగర్-మోతీ నగర్-బోరబండ బస్ స్టాప్ మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుంది.
- బోరబండ నుండి మైత్రీవనం వైపు వెళ్లే వాహనాలు: జీటీఎస్ కాలనీ-కల్యాణ్ నగర్ జంక్షన్-ఉమేష్ చంద్ర విగ్రహం వైపు మళ్లిస్తారు.
జనకమ తోట, సేవర్ ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద మాత్రమే వాహనాలు పార్క్ చేయాలి. సురక్షిత ప్రయాణం కోసం ప్రయాణికులు ముందస్తుగా మార్గాలను ప్రణాళిక చేసుకోవాలని అధికారులు సూచించారు.