అమరావతీ: వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ సీ పోర్ట్ లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్న కేసులో నిందితులపై ఈడీ ఉచ్చు బిగిస్తోంది. కేఎస్‌పీఎల్ యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు గుర్తించింది.
దాని ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్‌ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. కేసులో నిందితులైన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తనయుడు వై.విక్రాంత్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడి సోదరుడు, అరబిందో సంస్థ యజమాని పెనక శరత్‌చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి నామినీ సంస్థగా పేరొందిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్‌ఎల్‌పీ ప్రతినిధులకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలంటూ నోటీసులలో ఆదేశించింది.
అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున తాను విచారణకు రాలేనంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా అనారోగ్య కారణాల వల్ల హాజరు కాలేనంటూ విక్రాంత్‌రెడ్డి, ప్రస్తుతం విచారణకు రావటం కుదరదంటూ శరత్‌చంద్రారెడ్డి, ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణాలు చెప్తూ ఈడీ విచారణకు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది.
బలవంతంగా వాటాలు లాగేసుకున్న వ్యవహారంలో రికార్డుల ప్రకారం అంతిమ లబ్ధిదారైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (ప్రస్తుతం అరో ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్), దాని డైరెక్టర్లకు కూడా ఈడీ నోటీసులు ఇవ్వనుంది. వీరిని విచారించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనుంది. మరోవైపు, ఇదే కేసులో ఏపీ సీఐడీ సైతం చర్యలు వేగవంతం చేసింది. విచారణకు హాజరుకావాలంటూ శరత్‌చంద్రారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తర్వాత మిగతా వారికి కూడా విచారణకు పిలిచేందుకు సిద్ధమవుతోంది.