గ్రూప్-2 పరీక్షలకు మెరిట్ ప్రకారమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. రేపు, ఎల్లుండి జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని, అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు, అపోహలు పెట్టుకోకుండా ఎగ్జామ్స్ రాయాలని తెలిపారు.
ఇక ప్రశ్న పత్రాలకు సంబంధించి 58 చోట్ల స్టోరేజ్ పాయింట్లు పెట్టామన్నారు. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే ఛాన్సే లేదన్నారు. ఈసారి 5.51 లక్షల మంది అభ్యర్థుల పరీక్షలు రాయనుండగా, అందరికీ బయోమెట్రిక్ తప్పనిసరి చేశామన్నారు. టీజీపీఎస్సీపై నమ్మకముంచి అభ్యర్థులు పరీక్షలు రాయాలని, మెరిట్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరని బుర్రా వెంకటేశం చెప్పుకొచ్చారు.
2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం తీసుకున్నారని, ఈసారి తొందరగానే ఫలితాలు విడుదల చేస్తామన్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుంగా పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించినట్లు తెలిపారు.