శ్రీకాకుళం జిల్లాలో ఒకే రోజు నకిలీ నోట్లు చలామణి చేస్తున్న రెండు ముఠాలు పట్టుబడటం జిల్లా వ్యాప్తంగా కలకలాన్ని రేపింది. టెక్కలి డీఎస్పీ మూర్తి, సీఐ అవతారం ఈ ఘటనల వివరాలను మీడియాకు వెల్లడించారు. నకిలీ నోట్ల తయారీ, చలామణి వెనుక ఉన్న గ్యాంగ్‌ల గురించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
మెళియాపుట్టి మండలానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద రూ.50వేల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని సమాచారం మేరకు పలాస, మెళియాపుట్టి, వజ్రకొత్తూరు ప్రాంతాలకు చెందిన మరికొందరిని అరెస్టు చేశారు. వారి వద్ద రూ.57.25 లక్షల నకిలీ నోట్లు, కలర్ ప్రింటర్, సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు దాసరి రవికుమార్ నిందితుడిగా ఉండడం చర్చనీయాంశమైంది.
ఇక జి సిగడాం మండలం పెనసాం కూడలిలో ద్విచక్ర వాహనంపై నకిలీ నోట్లు తరలిస్తున్న గనగళ్ల రవి, లావేరుకు చెందిన రాజేశ్‌లు పట్టుబడ్డారు. ఒడిశాలోని పర్లాఖెముండి, గుణుపురం ప్రాంతాల నుంచి నకిలీ నోట్లను తెచ్చి చెలామణి చేస్తున్నారు. వారు మరింత సంపాదించాలని నోట్ల తయారీకి రసాయనాలు కూడా కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు రూ.15 లక్షల నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. ఈ కేసులో ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తి వంటి ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.