భారత క్రికెట్‌లో ఒకప్పుడు గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందిన వినోద్ కాంబ్లీ ఇప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత తనకు వచ్చే రూ.30 వేల పింఛన్తో జీవనం సాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పరిస్థితిని వివరించిన ఆయన, గతంలో ఎంతో గర్వపడే క్రికెటర్‌గా ఉన్నత స్థానంలో ఉండి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవడం బాధ కలిగిస్తోందన్నారు.
తన ఆరోగ్య పరిస్థితి కూడా చక్కగా లేదని కాంబ్లీ తెలిపారు. యూరిన్ సమస్యతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యుల సహాయంతో కొంతమేరకు కోలుకుంటున్నట్లు వెల్లడించారు. గతంలో తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల సమయంలో సచిన్ టెండూల్కర్ తనకు రెండు సర్జరీల కోసం ఆర్థిక సాయం చేసినట్లు గుర్తుచేశారు. సచిన్‌తో ఉన్న స్నేహాన్ని కాంబ్లీ ఎంతో గౌరవంగా గుర్తుచేసుకున్నారు. తన పరిస్థితిని తెలుసుకున్న కపిల్ దేవ్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చినట్లు , కపిల్ దేవ్ ఆఫర్ చేసిన రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ అవకాశం తన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకంగా ఉంటుందని ఆయన విశ్వసిస్తున్నారు. క్రీడాకారులకు రిటైర్‌మెంట్ తర్వాత మరింత సపోర్ట్ అందించాల్సిన అవసరముందని కాంబ్లీ అభిప్రాయపడ్డారు.
కాంబ్లీ క్రికెట్ అభిమానుల్లో తనదైన ముద్రవేసిన ఆటగాడు. కానీ క్రికెట్‌లో తాను సాధించిన గుర్తింపు, విజయాలు ఇప్పుడు తనకు ఉపయోగపడలేకపోతున్నాయి. క్రికెట్ కెరీర్ ముగిసిన తర్వాత భవిష్యత్తు కోసం అందరు ఆటగాళ్లూ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉదాహరణగా నిలుస్తున్నారు. కాంబ్లీ జీవిత పాఠం ఈ తరానికి మార్గదర్శకంగా ఉంటుంది.ప్రస్తుత పరిస్థితుల్లో భారత క్రికెట్ బోర్డు కూడా మాజీ క్రికెటర్ల సంక్షేమంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్రికెట్‌లో ప్రతిభావంతులుగా నిలిచిన ఆటగాళ్లు రిటైర్‌మెంట్ తర్వాత ఇబ్బందులు పడకూడదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.