రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.
ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా మధ్యంతర భృతిని ప్రకటించింది. మూలవేతనంలో 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, స్థానిక సంస్థల ఉద్యోగులకు గతేడాది అక్టోబరు 2న ఐఆర్ మంజూరు చేసింది. తమకు కూడా మధ్యంతర భృతి ఇవ్వాలని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేసే నాన్ టీచింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. అంగీకరించిన ప్రభుత్వం వారికి కూడా ఐఆర్ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్న మూలధన వేతనంపై 5 శాతం ఐఆర్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు లభ్యమవుతుంది. ఐఆర్ పెంపు వల్ల ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక భారం కొంత తగ్గుతుందని చెబుతున్నారు.