వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు నియామకాలు పూర్తి చేసిన ట్రంప్ తాజగా అమెరికా విద్యాశాఖ మంత్రిగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ సహ వ్యవస్థాపకురాలు లిండా మెక్‌మహన్‌ను నియమించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా చేసిన సమయంలో.. చిన్న తరహా వాణిజ్య శాఖకు మెక్‌మహన్ పనిచేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం ఆమె మిలియన్ల డాలర్లు విరాళం ఇచ్చారు. ట్రుత్ సోషల్ మీడియాలో లిండా ఓ పోస్టు చేశారు.
దశాబ్ధాల తన నాయకత్వ అనుభవాన్ని.. విద్యా, వ్యాణిజ్య వృద్ధి కోసం వాడనున్నట్లు ఆమె చెప్పారు. రాబోయే తరానికి చెందిన అమెరికా విద్యార్థులను, కార్యకర్తలను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో విద్యాశాఖను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. అమెరికాలో ఫేమస్ ప్రభుత్వ పాఠశాలలకు నిధులను అందించడంలో , ఫెడరల్ విద్యార్ధి సహాయ కార్యక్రమాలను నిర్వహించడంలో , అమెరికాలో విద్యపై డేటాను సేకరించడంలో విద్యాశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఫెడరల్ ప్రభుత్వంపై పర్యవేక్షణ భారాన్ని తగ్గించేందుకు తాను ప్రయత్నిస్తానని ట్రంప్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా విద్యను తిరిగి రాష్ట్రాలకే అప్పగిస్తామని, లిండా దీనికి నాయకత్వం వహిస్తారని ట్రంప్ ఓ ప్రకటనలో తెలిపారు.
మెక్‌మాన్ 2017 నుంచి 2019 వరకు ఎస్‌బీఏ అధిపతిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తన భర్త మెక్‌మాన్‌తో కలిసి క్యాపిటల్ రెజ్లింగ్, వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)ని స్థాపించారు. 2010లో కనెక్టికట్ నుంచి యూఎస్ సెనేట్‌కు రిపబ్లికన్ నామినీగా పోటీ చేసిన లిండా మెక్‌మాన్. డెమొక్రాటిక్ అభ్యర్ధి రిచర్డ్ బ్లూమెంటల్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పరాజయం పాలైనప్పటికీ. అమెరికా ఫస్ట్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ బోర్డ్‌కు అధ్యక్షురాలిగా లిండా పనిచేశారు. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆమె బిలియనీర్ హోవార్డ్ లుట్నిక్‌తో కలిసి పనిచేసింది. ఇటీవల మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ట్రంప్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆయన ఉద్యోగ సృష్టికర్త అని..అమెరికన్ కార్మికులకు బెస్ట్ ఫ్రెండ్ అని పేర్కొన్నారు.