పాకిస్థాన్లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ వద్ద ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. కారును పేల్చిన అనంతరం అతని సహచరులు కాల్పులకు పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామని ఓ అధికారి తెలిపారు. ఈ దాడికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పది రోజుల క్రితం కూడా పాక్ లో ఆత్మాహుతి దాడి జరిగి 27 మంది మృతి చెందగా..పదుల సంఖ్యలో గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌పై నవంబర్ 09 న ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా..ఇందులో 14మంది భద్రతాసిబ్బంది ఉన్నారు. మరో 62 మంది గాయపడ్డారు. ప్లాట్‌ఫామ్ నుంచి ఓ రైలు పెషావర్‌కు బయలుదేరుతుండగా పేలుడు సంభవించింది.
రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కార్యాలయంలో దుండగుడు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు క్వెట్టా డివిజన్ కమిషనర్ హంజా సఫ్తాక్ తెలిపారు. దుండగుడు లగేజ్‌తో రైల్వే స్టేషన్లోకి వచ్చాడని చెప్పారు. అయితే ఆత్మాహుతి దాడి చేయడానికి వచ్చే వారికి నిలువరించడం కష్టమని అన్నారు. కాగా, పేలుడు ధాటికి ప్లాట్‌ఫామ్ పైకప్పు దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. బాంబు పేలుడు శబ్ధం నగరంలోని వివిధ ప్రాంతాలకు వినిపించింది. ఈ దాడికి బలూచ్ లిబరేషన్ ఆర్మీ- బీఎల్ఏ బాధ్యత వహించింది. బీఎల్ఏను పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. బలూచిస్థాన్‌లోని వనరులను పాకిస్థాన్ కేంద్ర ప్రభుత్వం దండుకుంటూ, ఈ ప్రాంతం అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని బీఎల్ఏ ఆరోపించింది. వీటిని పాక్ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఇక్కడి వారితో కలిసి విదేశీ శక్తులు చేస్తున్న కుట్రగా అభివర్ణించింది.
కాగా, పాకిస్థాన్లో ముఖ్యంగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లలో గత ఏడాది కాలంలో ఇలాంటిఘటనలు పెరిగాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ సెక్యురిటీ స్టడీస్(CRSS) ప్రకారం ఈ ఏడాది మూడో త్రైమాసికంలో పాకిస్థాన్లో హింసాత్మక ఘటనలు 90శాతం పెరిగాయని స్థానిక మీడియా పేర్కొంది.