ముంబయి: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. జార్ఖండ్ విషయంలో కొంత ప్రశాంతత ఉండగా.. మహారాష్ట్రలో మాత్రం ఎన్నికల రోజున కూడా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. ముఖ్యంగా బిట్‌కాయిన్ స్కామ్ అంటూ.. అజిత్ పవార్ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు సినీ, రాజకీయ ప్రముఖులు క్యూలో నిలబడి ఓటు వేస్తున్నారు. ప్రజలు ఆసక్తిగానే ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇక బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఉదయం 9 గంటల వరకూ కేవలం 6.61 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ కొనసాగుతోంది. ఇక్కడ 9 గంటల వరకూ 12.71 శాతం పోలింగ్ నమోదైంది.
ఇక, మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4 వేల 136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మాక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇకపోతే.. ఝార్ఖండ్‌లో రెండు విడుతల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను తొలి విడత నవంబర్ 13వ తేదీన 43 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగతా38 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో సీఎం హేమంత్ సొరేన్, ఆయన భార్య కల్పనా సొరేన్, విపక్ష బీజేపీ నేత అమర్ కుమార్ బౌరీ సహా 528 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, 31 సమస్యాత్మక ప్రాంతాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఝార్ఖండ్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనున్నది.