సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కాసేపట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వయం సహాయక మహిళా సంఘాల ఇందిర మహిళా శక్తి స్టాల్స్ ను సందర్శించి అక్కడ మహిళలతో మాట్లాడుతారు. ఆపై అక్కడ నుండి సభా వేదిక వద్దకు చేరుకుంటారు. సభా వేదిక పైన రాష్ట్ర గీతాలాపనతో పాటు, జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఇక నేటికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభను వరంగల్ లో నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరంగల్ పై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో ఓ ట్వీట్ చేశారు. ట్వీట్ లో తెలంగాణ ఛైతన్యపు రాజధాని అని ఓరుగళ్లును కొనియాడారు. కాళోజీ నుండి పీవీ వరకు…మహనీయులను తీర్చిదిద్దిన నేలని చెప్పారు. స్వరాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్ సారుకు జన్మనిచ్చిన గడ్డ అని తెలిపారు.
హక్కుల కోసం వీరపోరాటం చేసిన…సమ్మక్క – సారలమ్మలు …నడయాడిన ప్రాంతమని పేర్కొన్నారు. దోపిడీకి వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మ యుద్ధ క్షేత్రమని తెలిపారు. వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు నేడు వస్తున్నానని ట్వీట్ లో సీఎం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటె సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులను అరెస్టు చేయడం జరిగింది. అర్ధరాత్రి నుంచే నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసారు. గిరిజన నేతలు, విద్యార్థులను సైతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. కాగా, బీఆర్‌ఎస్ నాయకుల అరెస్టులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాపాలన కాదని, ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన అని దుయ్యబట్టారు. ఉద్యమాల గడ్డ వరంగల్ నుంచి ముఖ్యమంత్రి పతనం ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.