నటి కస్తూరి ఇటీవల తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై తెలుగు, తమిళ సంఘాలు తీవ్రంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. దాంతో ఆమె కోసం అటు తమిళనాడులో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు వెతుకుతుంటే.. ఆమె కొంతకాలంగా తప్పించుకు తిరిగారు. అలాగే అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. కానీ కోర్టు ఆ బెయిల్ పిటిషన్‌ని కొట్టేసింది. ఆ తర్వాత పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టడం తో తాజాగా.. గచ్చిబౌలిలో ఉన్నారని పోలీసులకు సమాచారం అందడంతో చెన్నై పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ముందు కస్తూరిని హాజరుపరిచారు. అనంతరం నటి కస్తూరికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కస్తూరి నవంబర్ 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు కస్తూరిని చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.
ఈ నెల 3న చైన్నైలో జరిగిన ఓ కార్యక్రమానికి నటి కస్తూరి హాజరయ్యారు. అక్కడి జనాలను ఉద్దేశించి మాట్లాడుతూ తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వ్యాఖ్యాలపై కొందరు పోలీసులను ఆశ్రయించారు. దాంతో, కస్తూరి ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టు(Madras High Court)ను ఆశ్రయించింది. కానీ, సదరు హైకోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అందుకని పోలీసులకు చిక్కకూడదనే ఉద్దేశంతో ఆమె ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్‌లో తలదాచుకుంది.
ఇక కస్తూరి విషయానికి వస్తే.. తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల్లో పలు ప్రాముఖ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటీమణి. 1990లలో ఆమె సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రఖ్యాత తమిళ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి గుర్తింపు పొందారు. కస్తూరి తన నటనతో పాటు, తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడంలో కూడా బాగా ప్రసిద్ధి చెందారు. సామాజిక అంశాలు, రాజకీయాలు, సాంస్కృతిక సమస్యలపై సోషల్ మీడియాలో ఆమె చురుకైన వ్యక్తిగా ఉన్నారు.