తెలుగు రాష్ట్రాల విమాన ప్రయాణీకులకు ఎయిరిండియా తీపి కబురు అందించింది. శీతాకాల సర్వీసుల్లో భాగంగా అదనపు సర్వీసులను నడుపుతున్నట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అదనపు సర్వీసులను ప్రకటించడంతో ఈ మూడు నగరాల నుంచి వారంలో నడిచే సర్వీసుల సంఖ్య 173 నుండి 250కి పెంచడం జరిగింది. ఇక కొత్తగా ప్రకటించిన సర్వీసుల్లో హైదరాబాద్ – గ్వాలియర్ డైరెక్ట్ సర్వీస్, విశాఖపట్నం – విజయవాడ సర్వీస్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, కోచికి సర్వీసుల సంఖ్య పెంచారు. అలానే హైదరాబాద్ నుంచి 17 దేశీయ గమ్యాలు, సౌదీ అరేబియాలోని మూడు ప్రధాన విమానాశ్రయాలకు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు నడుపుతున్నట్లు కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అంకుర్ గార్గ్ తెలిపారు. అలాగే విజయవాడ నుంచి అంతర్జాతీయ గమ్యాలకు విమాన సర్వీసులు నడుపుతున్న ఏకైక సంస్థ ఎయిరిండియానే అని , సీజన్ మొత్తం మీద ఈ నగరాల నుంచి సర్వీసుల సంఖ్య 45 శాతం పెరిగినట్లు అంకుర్ గార్గ్ తెలిపారు.
ఇక ఎయిరిండియా (Air India) భారతదేశపు జాతీయ విమానయాన సంస్థ. 1932లో జేఆర్‌డీ టాటా స్థాపించిన ఈ సంస్థ, 1953లో భారత ప్రభుత్వం చేతికి వచ్చింది. 2021లో టాటా గ్రూప్ దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంది. వాస్తవానికి విస్తారా అనేది టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన జాయింట్ వెంచర్. ఇందులో టాటా గ్రూప్‌నకు 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు 49 శాతం వాటా ఉండేది. 2015లో విస్తారా సర్వీసులు ప్రారంభమయ్యాయి.
ఇప్పుడు ఇది టాటా గ్రూప్‌నకే చెందిన ఎయిర్ ఇండియాలో వీలినం అయ్యింది. దీని తరువాత ఎయిర్ ఇండియాలో – సింగపూర్ ఎయిర్‌లైన్స్ మరో రూ.3,195 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. అక్టోబర్‌లో టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ విలీనం అయ్యింది. తాజాగా విస్తారా విలీనం కావడం గమనార్హం. గతంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎయిరిండియాతో విలీనం అయ్యింది. ఎయిర్ సహారా జెట్ ఎయిర్‌వేస్‌లో కలిసిపోయింది. ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైంది. విమానాల్లో స్టార్‌బక్స్ కాఫీని అందించిన మొదటి ఎయిర్‌లైన్స్ విస్తారా. విమానాలను శుభ్రం చేయడానికి మొదటిగా రోబోలు ఉపయోగించింది కూడా విస్తారానే. అంతేకాదు లాయల్టీ కస్టమర్లకు ఉచితంగా వైఫైని కూడా అందించింది.