రాయ్పూర్ : దేశంలో ఇటీవల వందలాది విమానాలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో విమానానికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. నాగ్‌పూర్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానానికి గురువారం ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని భావించారు. అధికారుల అనుమతితో విమానాన్ని రాయ్‌పూర్ కు దారి మళ్లించి అక్కడ సేఫ్‌గా ల్యాండ్ చేశారు. అనంతరం ప్రయాణికులనంతా దింపేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. డాగ్ స్వ్కాడ్, బాంబ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకొని విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ లభించలేదని తెలిసింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాయ్‌పూర్ విమానాశ్రయంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో అక్కడ విమాన రాకపోలకు కొంత అంతరాయం ఏర్పడింది.
కాగా, ల్యాండింగ్‌కు గల కారణం తెలియకపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. సాంకేతిక సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ విమానాన్ని తనిఖీ చేశారని అన్నారు. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు మొత్తం 187 మంది ప్రయాణికులు ఉన్నారు.