బ్రెజిల్ సుప్రీంకోర్టు(Supreme Court) సమీపంలో భారీ బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఒక వ్యక్తి కోర్టు ఆవరణలో ప్రవేశించేందుకు ప్రయత్నించగా, అతన్ని అడ్డుకునే సమయంలో పేలుళ్లు జరిగాయి. పేలుళ్లు జరిగిన వెంటనే భద్రతా రీత్యా రక్షణ బలగాలు, ఫెడరల్ పోలీసులు వెంటనే సుప్రీం కోర్టులో ఉన్న అందరినీ ఖాళీ చేయించారు. పేలుళ్ల ధాటికి కోర్టు చుట్టుపక్కల వాతావరణమంతా దట్టమైన నల్లని పొగలు కమ్మేశాయి.
పేలుళ్లు జరిగిన సమయంలో సుప్రీం కోర్టు లోపల కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. కోర్టులో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. “కోర్టులో విచారణ చివరి సెషన్ ముగిసిన కొన్ని క్షణాల్లోనే రెండు భారీ పేలుళ్లు వినిపించాయి. పేలుళ్ల ధాటికి కోర్టు ఆవరణ కూడా కంపించింది. ఆ సమయంలో కోర్టులోపల మంత్రులు కూడా ఉన్నారు. వారిని సురక్షితంగా కోర్టు భవనం నుంచి భద్రతా బలగాలు తీసుకెళ్లాయి. ఫెడరల్ పోలీసులు వెంటనే చేరుకొని.. ఒక బాంబ్ కంట్రోల్ స్క్వాడ్‌తో కోర్టు పరిసరాల్లో తనిఖీ చేయించారు. ఈ ప్రదేశంలో ఉన్న త్రీ టవర్స్ ప్లాజాలో మొత్తం తనిఖీలు చేయించారు. త్రీ టవర్స్ ప్లాజాలో కీలక ప్రభుత్వ భవనాలైన సుప్రీం కోర్టు, ది ప్రెసిడెన్షియల్ ప్యాలెస్, కాంగ్రెస్ బిల్డింగ్ ఉన్నాయి. పేలుళ్లు సుప్రీం కోర్టు బయట ఉన్న కారు పార్కింగ్ ప్రదేశంలో జరిగాయి. జరిగిన రెండు పేలుళ్లలో ఒకటి కారులో జరిగింది.” అని తెలిపారు.
బిల్డింగ్ బయట ఓ మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. పేలుళ్ల ఘటనను ఆ దేశ సొలిసిటర్ జనరల్ జార్జ్ ఖండించారు. సుప్రీంకోర్టు బిల్డింగ్ బయట ఓ మృతదేహం ఉన్నదని, కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. పేలుళ్లు జరగడానికి ముందే ఆ ప్రాంతం నుంచి అధ్యక్షుడు లుయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా వెళ్లినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో బ్రెజిల్ లోని రియో డి జానిరియో నగరంలో జి20 సమావేశాలు ఉండగా రెండు భారీ పేలుళ్లు జరగడంతో సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసే పనిలో అధికారులు పడ్డారు. ఇలాంటి పేలుళ్లు జనవరి 2023లో కూడా బ్రెజిల్ లో జరిగాయి. అప్పుడు ఎన్నికలు నిజాయితీ జరగలేదని మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఆరోపణలు చేసిన తరువాత ఆయన మద్దతుదారులు ప్రభుత్వ భవనాల్లో చొరబడి కొత్త ప్రభుత్వాన్ని కూలదీయాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ప్రభుత్వ భవనాల బయట పేలుళ్లు కూడా జరిగాయి.