హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. మంగళవారం ఆయన ఢిల్లీ లో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి ఏఐసీసీ ముఖ్య నేతలతో భేటీ అయి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర , ఝార్ఖండ్ ఎన్నికల్లో వ్యవహరించాల్సి వ్యూహాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ తరఫున ఎవరిని బరిలోకి దింపుతారనే అంశంపై అటు పార్టీలోనూ.. ఇటు ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ పై చర్చ జరిగే అవకాశం ఉంది.
మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో కేటీఆర్ పలువురు కేంద్ర పెద్దలను కలిసే పనిలో ఉన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కంప్లైట్ ఇచ్చారు కేటీఆర్. సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని.. అమృత్ 2.O ప్రాజెక్ట్‌లో తెలంగాణకు కేటాయించిన 8వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరారు కేటీఆర్. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి కేటీఆర్ ఫిర్యాదుపై కేంద్రమంత్రి ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.