వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలం లగచర్లలో నిన్న ఫార్మా కంపెనీ ఏర్పాటుకు భూ సేకరణపై.. ప్రజాభిప్రాయ సేకరణకు జిల్లా కలెక్టర్‌తో పాటు కొడంగల్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి సహా పలువురు అధికారులు వెళ్లారు. అయితే.. ప్రజాభిప్రేయ సేకరణను వ్యతిరేకిస్తూ.. కలెక్టర్, అధికారులను రైతులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో రైతులు, అధికారుల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. అది కాస్త దాడికి దారి తీసింది.
కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై రైతులు దాడి చేశారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడి చేసినవారిలో ఇప్పటివరకు 52 మందిని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్‌జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డిలపై ఆయా గ్రామాల రైతులు కర్రలు, రాళ్లతో దాడులకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్ త్రుటిలో తప్పించుకోగా కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను తప్పించేందుకు యత్నించిన డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డిపైనా దాడి జరిగింది.