తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్ట్ ను ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. 175 కు 175 కొట్టబోతున్నాం అంటూ గొప్పగా ప్రచారం చేస్తే..ప్రజలు మాత్రం 11 కు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితి తీసుకొచ్చారు. అయితే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడును సైతం కోరారు. కానీ ఎలాంటి స్పందన రాకపోవడం తో కోర్టుకు వెళ్లారు. అసెంబ్లీలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పిటిషన్‌పై కోర్టు విచారణ దశలో ఉంది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీకి ప్రతిపక్ష హోదా డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అయితే ఈ సమావేశానికి సైతం జగన్ హాజరుకాలేదు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతోనే ఆయన అసెంబ్లీకి వెళ్లలేదని తెలుస్తోంది.
ఇక ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెను ప్రవేశ పెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94లక్షల కోట్లతో పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయాన్ని 2లక్షల34 వేలకోట్లుగా మూలధన వ్యయాన్ని 32 వేల 712 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 34 వేల 743 కోట్లు, ద్రవ్య లోటు 68 వేల 743 కోట్లుగా ఉండొచ్చని, రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి – జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, ద్రవ్య లోటు 2.12 శాతంగా ఉండొచ్చని వివరించారు. అలాగే ఉన్నత విద్యకు 2వేల 326 కోట్లు, ఆరోగ్యరంగానికి 18 వేల 421 కోట్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు , సంక్షేమానికి, అందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా 39వేల 7 కోట్లు కేటాయించారు.
ఎస్సీ సంక్షేమానికి 18,497 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 7వేల 557 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 4 వేల 376 కోట్లు ప్రతిపాదించారు. మహిళా శిశుసంక్షేమ శాఖకు 4వేల285 కోట్లు దక్కాయి. ఇక కీలకమైన పాఠశాల విద్యాశాఖకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖకు 29 వేల 909 కోట్లు, రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధిక కల్పనకు కీలకమైన నైపుణ్యాభివృద్ధి శాఖకు 12 వందల 15 కోట్లు కేటాయించారు.