శ్రీనగర్: మరోసారి జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో భద్రతా బలగాలు తాజాగా మరో ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, 2 హ్యాండ్ గ్రెనేడ్లు, నాలుగు మ్యాగజైన్లు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని లోలాబ్ అటవీ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు మంగళవారం సాయంత్రం నుంచి భారీ ఆపరేషన్ చేపట్టాయి.
ఎట్టకేలకు ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ఆర్మీ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. భద్రతా బలగాలు, సైన్యానికి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో టెర్రరిస్టు హతమైనట్లు చెప్పారు. ఉగ్రవాది హతమవ్వడంతో ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని తెలిపారు. అంతకుముందు బందిపోరా జిల్లాలోనూ ఓ ఉగ్రవాదిని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది.