న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా 47వ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలో ప్రధాని భారత్, అమెరికా మధ్య ఉన్న వాణిజ్య బంధాన్ని గుర్తు చేశారు. ట్రంప్ తొలి దశ పాలన సమయంలో.. ఆయనకు మోదీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలను మోడీ నెమరేసుకున్నారు. 2019 సెప్టెంబర్‌లో హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్‌ను కూడా ప్రధాని మోడీ గుర్తు చేశారు. 2020 ఫిబ్రవరిలో నమస్తే ట్రంప్ పేరుతో అహ్మదాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. అమెరికా, భారత్ మద్య వూహాత్మక భాగస్వామ్యం గురించి మాట్లాడారు. టెక్నాలజీ, రక్షణ, ఎనర్జీ, అంతరిక్ష రంగాలతో పాటు ఇతర రంగాల్లోనూ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఇద్దరూ పేర్కొన్నారు.
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ట్రంప్‌కు బుధవారం ఫోన్ చేసి అభినందించారు. ఈ విషయాన్ని మోదీ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో బుధవారం జరిగిన టెలిఫోన్ సంభాషణ చాలా గొప్పగా జరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ అధినేతతో మరోసారి సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నానని చెప్పారు.
“నా స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో గొప్ప సంభాషణ జరిగింది. ఆయన అద్భుతమైన విజయానికి అభినందనలు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం, ఇతర రంగాలలో ఇండియా-యూఎస్ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం” అని మోడీ ట్వీట్ చేశారు.