ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇటీవల ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో తన పేరు లేకపోవడం పట్ల ఆ జట్టు స్టార్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ భావోద్వేగానికి లోనయ్యాడు. 2021 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు తన ప్రాతినిధ్యం కొనసాగుతూ వస్తున్నప్పటికీ, రిటెన్షన్ జాబితాలో పేరు కనిపించకపోవడం కళ్లలో నీళ్లు తెప్పించిందని చెప్పాడు. కోల్‌కతా జట్టుతో గడిపిన అనుభవం తన జీవితంలో ప్రత్యేకంగా నిలిచిందని, ఈ అటాచ్‌మెంట్ వల్లే రిటెన్షన్‌లో పేరు లేకపోవడం బాధకరంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కోల్‌కతా జట్టు తనకు కేవలం ఆటగాళ్ల సమూహం కాకుండా, ఒక కుటుంబం లాంటి బంధాన్ని కలిగించిందని వెంకటేశ్ చెప్పాడు. మేనేజ్‌మెంట్, సహచర ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, యువ ఆటగాళ్లతో కలసి పనిచేయడం చాలా తీయని అనుభూతినిచ్చిందని, ఈ అనుబంధాన్ని మిస్ అవ్వడం బాధకరంగా ఉందని చెప్పాడు. ‘రెవ్‌స్పోర్ట్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ అయ్యర్ ఈ భావోద్వేగాన్ని పంచుకున్నాడు.
కోల్‌కతా రిటెన్షన్ జాబితా బలంగా ఉందని, ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో 14-16 ఓవర్ల వరకు కవర్ చేయగలరు, బ్యాటింగ్‌లో కూడా 5 స్థానం వరకు బలం ఉందని విశ్లేషించాడు. రిటెన్షన్ లిస్టులో తాను ఉండాలని ఆశించానని, అయినప్పటికీ వేలంలో కోల్‌కతా తనను తిరిగి ఎంపిక చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఈ సారి వేలం లైవ్ స్ట్రీమింగ్ చూస్తూ, కోల్‌కతా తనను ఎంచుకుంటుందా అనే ఉత్సాహంతో ఎదురు చూస్తానని సరదాగా అన్నాడు.అయితే గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాల్సి రావడంతో, 2024 ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టులోని అనేక మంది ఆటగాళ్లను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విడుదల చేసింది. అందులో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నారు. అయితే రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, రమణ్ దీప్ సింగ్, సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణాలను మాత్రం రిటెయిన్ చేసుకున్నారు.