ముంబై టెస్టులో న్యూజిలాండ్ చేతిలో జరిగిన గెలుపు చేజారడం పట్ల టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించారు. ఈ సిరీస్‌లో మన జట్టు సమష్టిగా ప్రదర్శన చేయడంలో విఫలమైందని, తన నాయకత్వం కూడా తగిన స్థాయిలో నిలవలేకపోయిందని రోహిత్ అంగీకరించారు. కెప్టెన్సీ బాధ్యతల్లో అనుకున్న స్థాయిలో నైపుణ్యాలు ప్రదర్శించలేకపోయానని ఆయన చెప్పారు టెస్టు సిరీస్ ఓడిపోవడం సాధారణ విషయమేమీ కాదని రోహిత్ అన్నారు. ఈ ఓటమి తనకు చాలా బాధ కలిగిస్తుందని, ఇది త్వరగా మరచిపోలేనిదని చెప్పాడు. మేము సమష్టిగా రాణించలేకపోవడమే ఈ ఓటమికి ప్రధాన కారణం. జట్టు అంతా మునుపెన్నడూ చూడని విధంగా ఈ సిరీస్‌లో తక్కువ స్థాయిలో ప్రదర్శన ఇచ్చింది అని రోహిత్ అన్నారు. ఈ మేరకు మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడారు.
మేము మా శక్తికి తగిన విధంగా ఆడలేకపోయాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. న్యూజిలాండ్ ప్లేయర్లు మమ్మల్ని అన్నివిధాలా మించిపోయారు. మొదటి ఇన్నింగ్స్‌లో సరైన స్కోరు చేయలేకపోవడం మాకు సమస్యగా మారింది. ముంబై టెస్టులో 28 పరుగుల ఆధిక్యం అందుకున్నప్పటికీ, దానిని మన జట్టు ప్రయోజనంగా మార్చుకోలేకపోయింది. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాన్ని చేధించగలమని భావించాం కానీ అది సాధ్యపడలేదు, అని రోహిత్ తెలిపాడు.
తన వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుతూ, సిరీస్‌లో స్థిరమైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం బాధకరంగా ఉందని రోహిత్ పేర్కొన్నారు. పరుగులు బోర్డ్‌పై ఉండాలని మీరు కోరుకుంటారు, నేనూ అదే కోరుకున్నాను. కానీ మనసులో ఉన్నదాన్ని అనుకున్న స్థాయిలో బయటపెట్టలేకపోయాను, అని రోహిత్ అన్నారు ఇక మూడవ టెస్టులో కీలకమైన పరుగులు చేసిన శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్‌లను రోహిత్ ప్రశంసించారు. ఈ పిచ్‌పై యువ ఆటగాళ్లు ఎలా దూకుడుగా ఆడాలో చూపించారని, వారి ప్రదర్శన జట్టుకు ఎంతో ప్రేరణనిచ్చిందని అభిప్రాయపడ్డారు.