అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది.. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశామని గుర్తుచేశారు. ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా..? అని మండిపడ్డారు. హోం మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి పాప చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి.. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది.. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోందని తెలిపారు.