మూసీని కంపు చేసింది టీడీపీ, కాంగ్రెస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మూసీ నదిపై బీఆర్ఎస్వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ప్రాజెక్ట్‌తోనే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందన్న వారు తెలుసుకోవాల్సింది చాలా ఉందని కొన్ని అంశాలను లేవనెత్తారు. మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్‌లో నిలిచిందని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ తనకు అంటిన బురదనే అందరికీ అంటించాలని చూసే రకం అని ఆరోపించారు. పాలన చేతగాక పనికిరాని మాటలు మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆయన ఆరోపించారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు మూసీ మురుగులో కాంగ్రెస్ పొర్లుతోందన్నారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఒక్క ఇళ్లు కూల్చినా తాము సహించేది లేదని హెచ్చరించారు. బుల్డోజర్లకు తమ పార్టీ కార్యకర్తలు అడ్డుగా ఉంటారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తమకు నచ్చిన విధంగా ఇష్టారాజ్యాంగా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తమ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. పేదల కడుపు కొట్టి పెద్దలకు ఇచ్చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజంగా ఉందని ఆరోపించారు.
ప్రస్తుతం పారిశ్రామిక వ్యర్థాలు 90 శాతానికిపైగా మూసీలోనే కలుస్తున్నాయని ,బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందే మూసీ మురికి కూపంగా మారిందన్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో డీపీఆర్ మూసీ కోసం రూ.16,634 కోట్లతో ప్రణాళికలు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి మూటలు పంపేందుకే రేవంత్ మూసీ ప్రాజెక్టును తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు. నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ ఎలా అయితే మాటలు మార్చారో మూసీ విషయంలో రేవంత్ అలాగే మాట్లాడుతున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణ అనే పదాన్ని రేవంత్ మొదట వాడారని తెలిపారు. ఇప్పుడు మాట మారుస్తూ అపరిచితుడిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు.
ప్రజెంటేషన్ పేరుతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి పరువు తీసుకున్నారని కేటీఆర్ విమర్శించారు. నిన్నటి సమావేశంలో రేవంత్ అన్ని అబద్ధాలు చెప్పారన్నారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని సెటైర్లు వేశారు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ గ్రాఫిక్స్ మాయజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. లక్షన్నర కోట్ల దోపిడిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.