భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయాధ్యక్షుడి ప్రకటన మరో వారం, పది రోజుల్లో రానుంది. పార్టీ నియమావళి ప్రకారం, జాతీయాధ్యక్షుడి ఎన్నిక జరగాలంటే దేశంలోని కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలి. అయితే, రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు జాప్యం కావడం, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నిక ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పటి వరకు దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతర్గత ఎన్నికలు పూర్తయ్యాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూనిట్లు కలుపుకుంటే మొత్తం 36. ఇందులో సగం పూర్తి కావాలంటే, మరో 6 రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అప్పుడే జాతీయాధ్యక్షుడి ఎన్నిక చేపట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ మేరకు ఆ 6 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల కసరత్తు తీవ్రతరమైంది. తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, గుజరాత్ సహా రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ జాబితాలో ఉన్నట్టు తెలిసింది.
ప్రస్తుతం పరిస్థితి
బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అధ్యక్ష మార్పు ఉండకపోవచ్చని, ప్రస్తుత అధ్యక్షుడికే కొనసాగింపు ఇవ్వవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జాతీయాధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఎవరూ ఊహించని నేతలను తెరపైకి తెస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఈసారి జాతీయాధ్యక్షుడి విషయంలోనూ అలాగే వ్యవహరించవచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మార్చి 15 తర్వాత మంచి రోజులు లేవు కాబట్టి ఈ లోగానే కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, జాతీయాధ్యక్షుడి కోసం పేర్లను ప్రతిపాదించాల్సిందిగా రాష్ట్ర యూనిట్లకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత బీజేపీ జాతీయాధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా (జేపీ నడ్డా) పదవీకాలం పూర్తయినప్పటికీ, ఆయనకు తాత్కాలికంగా పదవీకాలాన్ని పొడిగిస్తూ, కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే వరకు అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగే వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే.
నాయకత్వ సమీకరణాలు
కీలక పదవులను అప్పగించే విషయంలో ఏ రాజకీయ పార్టీ అయినా సామాజిక, ప్రాంతీయ, మత, లింగ సమీకరణాలను పరిశీలిస్తుంది. ఇప్పుడు బీజేపీ జాతీయాధ్యక్షుడి ఎన్నిక విషయంలోనూ పార్టీ అగ్రనాయకత్వం వివిధ సమీకరణాలను బేరీజు వేసుకుంటోంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తర్వాత దక్షిణాది రాష్ట్రాల నుంచి అధ్యక్ష బాధ్యతలను ఎవరూ చేపట్టలేదు. 2002-2004 మధ్యకాలంలో వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయాధ్యక్షుడిగా పనిచేయగా, ఆయన కంటే ముందు జానా కృష్ణమూర్తి 2001-2002 మధ్యకాలంలో, బంగారు లక్ష్మణ్ 2000-2001 మధ్యకాలంలో ఈ పదవిని అందుకున్న దక్షిణ భారతీయులుగా రికార్డుల్లో ఉన్నారు.
దక్షిణాది నుండి ఎవరికీ అవకాశం?
ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి రేసులో ఎవరున్నారన్నది పరిశీలిస్తే, బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ దక్షిణాదిన కర్ణాటకకు చెందినవారే. ఆయన జాతీయస్థాయిలో అధ్యక్షుడి తర్వాత అత్యంత ప్రాధాన్యత కల్గిన పదవిలో పనిచేస్తున్నారు. పైపెచ్చు బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) నుంచి వచ్చారు. కాబట్టి ఆయన పేరును పరిశీలించవచ్చని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడిగా ఉన్న డా. కే. లక్ష్మణ్ (తెలంగాణ), మహిళా మోర్చా జాతీయాధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ (తమిళనాడు) కూడా దక్షిణాదికి చెందినవారే. వీరిలో వనతి శ్రీనివాసన్ మహిళ కావడంతో ఆ సమీకరణాల్లోనూ ఆమెకు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉత్తరాదిన నుండి ప్రధాన అభ్యర్థులు
ఉత్తరాది రాష్ట్రాల నుంచి భూపేంద్ర యాదవ్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ వంటి నేతల పేర్లు రేసులో వినిపిస్తున్నాయి. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పటికీ, ముఖ్యమంత్రి పదవికి దూరమైన మాజీ సీఎం వసుంధర రాజే పేరు సైతం అధ్యక్ష పదవి రేసులో వినిపిస్తోంది. పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న సునీల్ బన్సల్, మహారాష్ట్ర బీజేపీ నేత వినోద్ తావ్డేలు సైతం రేసులో ఉన్నారు.
మహిళా అభ్యర్థికి అవకాశం?
బీజేపీ ఇప్పటి వరకు రాష్ట్రపతి, ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ సహా మరెన్నో పదవులను మహిళలకు కట్టబెట్టినప్పటికీ, ఆ పార్టీ జాతీయాధ్యక్ష పదవిలో ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా లేదు. చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేసిన కమలనాథులు, అధ్యక్ష పదవిని సైతం మహిళ చేతిలో పెట్టి, జనాభాలో సగం ఉన్న మహిళల మనసు గెలుచుకునే ప్రయత్నాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎవరు లీడ్‌లో ఉన్నారు?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, బీజేపీ కొత్త జాతీయాధ్యక్షుడిగా ఎంపికయ్యే అవకాశం ఉన్న ప్రధాన నేతలు:
బీఎల్ సంతోష్ (కర్ణాటక) – RSS బ్యాక్‌గ్రౌండ్ కలిగి, సంస్థాగతంగా బలమైన నాయకుడు.
కే. లక్ష్మణ్ (తెలంగాణ) – ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీ విస్తరణలో కీలకం.
వనతి శ్రీనివాసన్ (తమిళనాడు) – మహిళా మోర్చా జాతీయాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్) – బీజేపీ కేంద్రీకృత నాయకత్వానికి అత్యంత సన్నిహితుడు.
వసుంధర రాజే (రాజస్థాన్) – మాజీ సీఎం, మహిళా నాయకురాలి హోదా.
బీజేపీ జాతీయాధ్యక్ష పదవి ఎవరికీ దక్కనుందనేది మరికొన్ని రోజుల్లో స్పష్టత వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యే దశకు చేరుకోవడంతో, పార్టీ హైకమాండ్ ఫైనల్ నేమ్‌ను త్వరలోనే ప్రకటించనుంది. ఏది ఏమయినా, ఈసారి బీజేపీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.