అమరావతి: మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..యువగళం పాదయాత్ర ఆలూరు, ఆదోనిలో కొనసాగుతున్న సమయంలో కుటుంబాలు మూకుమ్మడిగా వలసలు వెళ్లడం చూశానని, అవన్నీ చూశాకే ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు ఇస్తామని హామీ ఇచ్చానని వెల్లడించారు. ఒకే వాహనంపై 200 మంది వెళ్లడం కూడా గమనించానని ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సాగు, తాగునీరు ఇచ్చే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

కర్నూలు వెనుకబడి ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవం
నంద్యాల తర్వాత కర్నూలులో పాదయాత్ర చేశానని, ఈ రెండు ప్రాంతాల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించిందని అన్నారు. కర్నూలు జిల్లాలో శివారు ప్రాంతాలకు కూడా సాగు, తాగునీరు అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో రెండుసార్లు చర్చించినట్లు అసెంబ్లీ వేదికగా చెప్పారు. స్థూల నమోదు నిష్పత్తి, అక్షరాస్యతలో కర్నూలు వెనుకబడి ఉందనేది ఎవరూ కాదనలేని వాస్తవమని ఆయన అన్నారు. అందుకే రాబోయే డీఎస్సీలో కర్నూలుకు ఎక్కువమంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు.
విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్
సీజనల్ హాస్టల్స్‌కు సంబంధించి కేవలం భోజనం పెట్టడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. కరువు ప్రాంతాల్లోని ప్రజలు వేరేచోటకు వలసలు వెళ్లిన సమయంలో అక్కడ అడ్మిషన్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల ట్రాకింగ్ ఉంటేనే డ్రాపవుట్స్ తగ్గుతాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో 2024-25లో 121 సీజనల్ హాస్టళ్లు ఉండగా, వాటిలో 6,040 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించినట్లు చెప్పారు. ఇందుకోసం రూ.6.04 కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన అన్నారు. సీజనల్ హాస్టళ్ల నిర్వహణ ఇప్పటివరకు ప్రణాళికాబద్ధంగా లేదని అన్నారు.