న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు 2025-26 వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీంతో వరుసగా ఎనిమితోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె గుర్తింపు దక్కించుకోనున్నారు. అదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రికార్డును ఆమె సమం చేయనున్నారు.
కాగా, పార్లమెంట్‌లో బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టడానికి ముందు నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. బడ్జెట్ ను రాష్ట్రపతికి అందజేశారు. బడ్జెట్ లోని కీలక వివరాలను వివరించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి అనుమతి కోరారు. బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు అనుమతిస్తూ రాష్ట్రపతి ముర్ము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు స్వీటు తినిపించారు. రాష్ట్రపతితో సమావేశం ముగిసిన తర్వాత ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర మంత్రి పార్లమెంట్ కు చేరుకున్నారు. మరికాసేపట్లో లోక్ సభలో కేంద్ర మంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు.

అంతకుముందు నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ విభాగానికి వెళ్లిన నిర్మలమ్మ అక్కడి నుంచి బహీఖాతా తీసుకువచ్చారు. ఎరుపు రంగులో ఉన్న బహీఖాతాలో బడ్జెట్ డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం నుండి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టిన ఈ సర్వే, దేశ ఆర్థిక ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.. సూక్ష్మ, చిన్న,మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), మూలధన వస్తువులపై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయాలని యోచిస్తోందని పేర్కొంది.