చెన్నై: జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఆయన కారు ఎక్కేందుకు వెళ్తుండగా మీడియా ప్రతినిధులు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ప్రశ్నించారు. దానికి ఉదయనిధి స్పందిస్తూ… ‘వెయిట్ అండ్ సీ’ అని సమాధానం ఇచ్చారు.
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చారు. దీనిపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు, నాయకులు మండిపడ్డారు. నిన్న తిరుమల లడ్డూ వివాదంపై మాట్లాడిన పవన్ కల్యాణ్ సనాతన ధర్మంపై విమర్శలు చేసే వారిని కూడా టార్గెట్ చేశారు. నిన్న ఆయన తమిళంలో మాట్లాడుతూ ఉదయనిధికి కౌంటర్ ఇచ్చారు. సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని ఏపీ డీప్యూటీ సీఎం అన్నారు. అలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకుపోతారన్నారు. తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావొచ్చు… పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు.