తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ చీఫ్ విజయ్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. చెన్నైలోని YMCA మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ ప్రత్యేకంగా పాల్గొని, ముస్లిం సోదరులతో కలిసి భోజనం చేశారు.
ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు
ఈ సందర్భంగా విజయ్ ముందుగా ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. ముస్లిం సంప్రదాయాల్ని గౌరవిస్తూ రంజాన్ నెలలో ఉపవాస దీక్షనంతరం చేసే ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ముస్లిం మత పెద్దలు, రాజకీయ నేతలు పాల్గొన్నారు.
మతసామరస్య దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు
విందులో పాల్గొన్న విజయ్ తన సాంస్కృతిక మరియు మతసామరస్య దృక్పథాన్ని మరోసారి చాటిచెప్పారు. మత సమానత్వం, సామాజిక సమగ్రతపై ఆయన ప్రసంగించి అందరికీ సమాన అవకాశాలు అందేలా తన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా విజయ్ ముస్లింలతో కలిసి పలు ముఖ్యమైన విషయాలపై చర్చించినట్లు సమాచారం.

ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
విందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీవీకే శ్రేణులు, అభిమానులు ఈ ఫొటోల్ని విస్తృతంగా షేర్ చేస్తూ, విజయ్ మత సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్నారని కొనియాడుతున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో విజయ్ ఈ తరహా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.