Donald Trump: విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టిన డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఇది. వచ్చే నెలలో అరబ్ దేశాల్లో పర్యటించనున్నట్లు ఆయనే స్వయంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, పర్యటన పూర్తి షెడ్యూల్, ఎజెండా వంటి వివరాలపై అధ్యక్షుడు స్పష్టతనివ్వలేదు. తాను ఖతార్ , యూఏఈ , సౌదీ అరేబియా దేశాల్లో పర్యటించనున్నట్లు ట్రంప్ తెలిపారు.

2017లో ట్రంప్ అధ్యక్ష హోదాలో తొలిసారి సౌదీ పర్యటన
ఈ సందర్భంగా అమెరికన్ కంపెనీల్లో సౌదీ ఒక ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న విషయాన్ని ట్రంప్ గుర్తు చేశారు. ఆయా కంపెనీలు సౌదీతో పాటు మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలకు కావాల్సిన పరికరాలను తయారు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా మధ్యప్రాచ్యంతోనూ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. 2017లో ట్రంప్ అధ్యక్ష హోదాలో తొలిసారి సౌదీ లో పర్యటించారు. ఆ సమయంలో రియాద్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. అవి కొనసాగించాలనే ఉద్దేశంతోనే తొలి పర్యటనకు అక్కడికే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ట్రంప్ అరబ్ దేశాల పర్యటన
ఇక, ఇటీవల ఇజ్రాయెల్ దాడులతో ధ్వంసమైన గాజాను స్వాధీనం చేసుకుని అమెరికా దాన్ని పునర్‌నిర్మిస్తుందని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకంటే ముందు గాజాలో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఆయన ప్రతిపాదించగా.. ఆయా దేశాలు ఖండించాయి. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తమ ప్రతిపాదనలను నిరాకరిస్తే అమెరికా నుంచి అందే సాయం నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఈజిప్టు రూపొందించిన గాజా అభివృద్ధి ప్రణాళికవైపు గల్ఫ్ దేశాలు మొగ్గు చూపాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ అరబ్ దేశాల పర్యటనకు వెళ్తానని ప్రకటించడం గమనార్హం.