న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ‘గిరిజన ఆడబిడ్డ’ను ‘రాజకుటుంబం’ అవమానించిందని తప్పుపట్టారు. ఢిల్లీలోని ద్వారకలో శుక్రవారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము ఒక గిరిజన కుటుంబం నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని, ఆమెను అవమానించడం దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించడమేనని అన్నారు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ప్రారంభిస్తూ ద్రౌపది ముర్ము శుక్రవారం చేసిన ప్రసంగంపై సోనియాగాంధీ పార్లమెంటు వెలుపల స్పందించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వివాదం రేపాయి. ప్రసంగం చివర్‌లో రాష్ట్రపతి బాగా అలసిపోయారు. మాట్లాడలేకయారు అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ మాట్లాడుతూ.. ద్రౌపది ముర్ము మాతృబాష హిందీ కాదు, ఒడియా. ఈరోజు పార్లమెంటులో ఎంతో ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు. కానీ రాజకుటుంబం మాత్రం ఆమెను అమానించడం మొదలుపెట్టారు. ఆమె ప్రసంగం బోర్ కొట్టిందని ఒకరు అంటే, ‘పూర్ థింగ్’ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ఇది పదికోట్ల మంది గిరిజనులకు అవమానించడమే. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఇది అవమానమే. వీళ్లు విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజారుస్తుంటారు, అర్బన్ నక్సల్ గురించి మాట్లాడుతుంటారు. అహంకారంతో నిండిన ఆ రెండు పార్టీలు (ఆప్, కాంగ్రెస్) చేతులు కలపడం పట్ల ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని మోడీ హెచ్చరించారు.
ద్రౌపది ముర్ముపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేయగా, రాష్ట్రపతి భవన్ సైతం కాంగ్రెస్ ప్రముఖ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రపతి గౌరవాన్ని కించపరచేలా ఉన్నాయని, రాష్ట్రపతి ఎలాంటి అసలట లేకుండా ప్రసంగం చేశారని తెలిపింది. ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్‌కు హితవు పలికింది.