కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ బుధవారం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కుల గణన సర్వేను తప్పుబడుతూ అభ్యంతరకరమైన భాషతో విమర్శలు చేయడం, కుల గణన ఫారంను దగ్ధం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ఈ నోటీసుల్లో పేర్కొంది. మంత్రి సీతక్క కూడా కీలక కామెంట్స్ చేశారు. మల్లన్న అలా మాట్లాడటం బాధగా ఉందని.. ఆయనపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ లైన్ క్రాస్ చేసి కులగణన సర్వే నివేదికకు నిప్పు పెట్టడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. అలాఎందుకు చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మల్లన్న ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకుండా ఆయనపై వేటు తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మలన్న వ్యవహార శైలిపై మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేశారు. మల్లన్న కోసం తాము చాలా కష్టపడ్డామని.. అందుకు తమకు బాధగా ఉందన్నారు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీనా? కాదా? అనేది ఆయనే డిసైడ్ చేసుకోవాలని సూచించారు. పార్టీలో ఉన్నప్పుడు పార్టీ లైన్‌లోనే మాట్లాడాలన్నారు. కులగణన సర్వే సరిగా లేదని మల్లన్న మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. కులగణనపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ వేదికల మీద మాట్లాడాలే కానీ. ఇలా బహిరంగంగా మాట్లాడటం, వాటిని కాల్చివేయం మంచిది కాదని హితవు పలికారు. మల్లన్న సంగతి పార్టీనే చూసుకుంటుందన్నారు. ప్రజల సంతోషాన్ని చూసి ఓర్వలేక దీనిని అడ్డుకోవాలనే కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీసీల లెక్క 56 శాతానికి పైగా తేలిందని. ఎక్కడా ఎవరికీ కూడా నష్టం జరగలేదని సీతక్క వ్యాఖ్యనించారు. మేక వన్నె పులిలా బీఆర్ఎస్ నేతలు బీసీల హక్కులను అడ్డుకుంటున్నారని ఆమె తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.