Revanth Reddy : 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజన తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడింది. ఈ బిల్లును 59 ఎస్సీ కులాలను మూడు విభాగాలుగా విభజిస్తూ రూపొందించారు. గ్రూపు-1లో అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1 శాతం రిజర్వేషన్, మాదిగలు ఉన్న గ్రూపు-2 కులాలకు 9 శాతం, మాలలు ఉన్న గ్రూపు-3 కులాలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తోందని అన్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు అనేక అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు.

బాబూ జగ్జీవన్ రామ్‌ను కేంద్ర మంత్రిగా నియమించి గౌరవించిందని, దేశ చరిత్రలో తొలిసారి దామోదరం సంజీవయ్యను ఎస్సీ వర్గానికి చెందిన ముఖ్యమంత్రిగా చేయడంలో కూడా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ కోసం తీవ్రమైన ఉద్యమాలు జరిగాయని ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని సీఎం తెలిపారు. దశాబ్దాలుగా వేచిచూస్తున్న సమస్యకు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పరిష్కారం లభించడం గర్వంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన గంటలోపే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లు అమలుకు ముందు జాగ్రత్త చర్యగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తెలిపారు. కమిషన్ నివేదికను ఏ మాత్రం మార్పు చేయకుండా ఆమోదించామని సీఎం వెల్లడించారు.
బిల్లుతో ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారమవుతుందని, దళితుల హక్కులకు మరింత భరోసా లభిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించబడటంతో మాదిగ, మాలా సామాజిక వర్గాల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, మరికొందరు తగిన మార్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఇక ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందా? అనే దానిపై ఆసక్తి నెలకొంది.