ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరో చెప్పిన రవిశాస్త్రి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ రేపు (మార్చి 9) జరగనుంది. గ్రూప్-ఏ నుంచి అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా, న్యూజిలాండ్‌తో టైటిల్ కోసం తలపడనుంది. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌ను ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు, మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి కీలక విశ్లేషణ అందించారు. ఫైనల్ పోరుకు ముందు దుబాయ్ పిచ్ విశ్లేషణ చేయడం చాలా కీలకం. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు దుబాయ్‌లో ఉపయోగించిన పిచ్‌ల కంటే భిన్నమైన, బ్యాట్స్‌మెన్‌కు అనుకూలమైన వికెట్ ఉండే అవకాశముందని తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో రెండు జట్లు తమ తుది జట్లను పిచ్‌ను పరిశీలించిన తర్వాతే ఖరారు చేసే అవకాశముందని అంచనా వేశారు.ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా లేదా అక్షర్ పటేల్ కీలక ప్రదర్శన చేయొచ్చని, న్యూజిలాండ్ జట్టు నుంచి గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్‌విన్నర్‌గా మారవచ్చని చెప్పారు. వీరిలో ఎవరో ఒకరు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవుతారని ఊహించారు.

కోహ్లీ vs విలియమ్సన్ – ఎవరి హవా నడుస్తుంది
ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ ప్రధానంగా నిలవొచ్చని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. అదే విధంగా, న్యూజిలాండ్ జట్టులో కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్రలు టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని విశ్లేషించారు. ఈ టోర్నీలో టీమిండియా ఇప్పటివరకు ఓటమి పాలవ్వకుండా ఫైనల్‌కు చేరిందని, కానీ న్యూజిలాండ్ జట్టుకు భారత్‌ను ఓడించే సామర్థ్యం ఉందని అన్నారు.
టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన
ఈసారి టీమిండియా తన అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు జట్టుగా రాణించారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే ధోరణి కొనసాగిస్తే కప్పు మళ్లీ టీమిండియా ఖాతాలో చేరే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టీమిండియా – న్యూజిలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ మ్యాచ్ మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. క్రీడాభిమానులు ఈ అద్భుతమైన పోరును ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈసారి ఛాంపియన్ ఎవరో చూడాలి!