న్యూఢిల్లీ : ఈరోజు నుండి కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తొలిరోజు సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాసేపటి క్రితం పార్లమెంట్ కు చేరుకున్న ప్రధాని మోడీ పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చ జరగాలని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీదేవి కరుణ చూపాలని ఆకాంక్షించారు. బడ్జెట్ సమావేశాల్లో అర్థవంతమైన చర్చకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు విపక్షాలు మద్దతు తెలపాలని కోరుతున్నానని చెప్పారు. వికసిత్ భారత్ కు ఈ బడ్జెట్ ఊతమిస్తుందని అన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. అంతర్జాతీయంగా మన దేశ పరపతి పెరుగుతోందని చెప్పారు. 2047 కల్లా మన దేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు. రీఫామ్, పర్ఫామ్, ట్రాన్స్ఫామ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని మోడీ తెలిపారు. ఇన్నొవేషన్, ఇన్ క్లూజన్, ఇన్వెస్ట్ మెంట్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.

ఇక, పార్లమెంట్‌లో ఇటీవల మరణించిన మాజీ ప్రధాని మన్మోహన్ సహా పలువురికి నివాళులు అర్పించనునున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్‌కు కూడా పార్లమెంట్ నివాళులు అర్పించనుంది. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డ్ సృష్టించబోతున్నారు.
పార్లమెంట్‌లో ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది..
.ఎయిర్‌క్రాఫ్ట్ ఆబ్జెక్ట్స్ ప్రొటెక్షన్ బిల్లు
.వక్ఫ్ సవరణ బిల్లు
.ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు
.బ్యాంకింగ్, రైల్వే, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ బిల్లులు
.2025 ఫైనాన్స్ బిల్లు.
.మొత్తంగా 10 బిల్లుల వరకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమైన తేదీలివే..
.జనవరి 31 – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే నివేదికను లోక్‌సభలో ప్రవేశపెడతారు.
.ఫిబ్రవరి 1 – కేంద్ర బడ్జెట్ 2024-25ను నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు.
.ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్ సమావేశాల తొలి విడత ఉంటుంది.
.మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాల తొలి విడత ఉంటుంది.
.మొత్తం 27 రోజులపాటూ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి.