అమెరికా విధించే టారిఫ్‌పై తొందరపడకూడదన్న శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోడీ జరిపిన చర్చలు భారత్‌కు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని ప్రశంసించారు. దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని శశిథరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్నందున.. మనం కూడా తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుంచి ఎగుమతయ్యే ఉత్పత్తులపై పడే అవకాశం ఉందన్నారు. కొందరు యువత తప్పుడు దారిలో అక్రమంగా విదేశాలకు వెళ్తున్నారని అన్నారు. అలా వెళ్లిన భారత పౌరులను తిరిగి తీసుకురావాలని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమ వలసలను నివారించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రంప్ ఎఫ్-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేయడాన్ని భారత్‌కు శుభ పరిణామంగా పేర్కొన్నారు.
కాగా, ప్రధాని మోడీ అక్రమ వలసల అంశంపై అమెరికాలో కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ఒక దేశంలోకి ప్రవేశిస్తే, అక్కడ నివసించే హక్కు ఉండదని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుందన్నారు. అలా వెళ్లిన భారతీయులు తిరిగి రావాలని ప్రధాని మోడీ విజ్ఞప్తి చేశారు. ఇక, ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. భద్రత, వాణిజ్యం, భారత్-అమెరికా సంబంధాల్లో రక్షణ, సాంకేతికత సహా పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.