జియో హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు ‘ఊప్స్ అబ్ క్యా’ వెబ్ సిరీస్ వచ్చింది. శ్వేతాబసు ప్రసాద్ – ఆషిమ్ గులాటి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్స్ గా రూపొందించారు. నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్, తెలుగులోను అందుబాటులో ఉంది.
కథ:
శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఊప్స్ అబ్ క్యా’ వెబ్ సిరీస్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందింది. రూహి (శ్వేతా బసు ప్రసాద్) స్టార్ హోటల్‌లో ఫ్లోర్ మేనేజర్‌గా పని చేస్తూ మధ్యతరగతి జీవితాన్ని గడుపుతోంది. తల్లిని మాత్రమే చూసి పెరిగిన రూహికి తండ్రి ఎవరో తెలియదు. ఓంకార్ (అభయ్ మహాజన్) అనే ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌ను ప్రేమిస్తుంటుంది.ఈ క్రమంలో రూహి పనిచేస్తున్న హోటల్ యజమాని కొడుకు సమర్ (ఆషిమ్ గులాటి) అనారోగ్యం నుంచి కోలుకుని హోటల్ వ్యవహారాల్లో మళ్లీ చురుకుగా పాల్గొనడం మొదలు పెడతాడు. కానీ అతని భార్య అలీషా (సోనాలి కులకర్ణి) అతనిపై ప్రేమ కంటే అతని ఆస్తిపాస్తులపైనే ఎక్కువ దృష్టిపెడుతుంది. అలీషా తన ప్రియుడితో కలిసి సమర్‌ను మోసం చేస్తూ ఉంటుంది.సమర్ ‘స్పెర్మ్’ ద్వారా ఆమె గర్భవతి కావాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా జరిగిన పొరపాటు వలన ఆ ‘స్పెర్మ్’ ను రూహి గర్భంలోకి ప్రవేశపెడుతుంది డాక్టర్ రోషిణి. ఈ విషయం తెలిసి రూహి లవర్ ఓంకార్ షాక్ అవుతాడు. బేబీని తమకి ఇచ్చేయమని సమర్ – అలీషా వేరువేరుగా రూహిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. సమర్ హోటల్లో రాజ్ మల్హోత్రా మర్డర్ జరుగుతుంది. ఆమెను సమర్ గానీ,అతని భార్య అలీషా గాని హత్య చేసి ఉండొచ్చని ఓంకార్ భావిస్తాడు. అలాగే సమర్ హోటల్ కేంద్రంగా సిటీలో డ్రగ్స్ మాఫియా జరుగుతుందనే అనుమానం కూడా ఓంకార్ కి వస్తుంది. ఈ మాఫియా వెనుక ‘మాయాసుర్’ ఉండొచ్చని అనుమానిస్తాడు. మాయాసుర్ ఎవరు? రాజ్ మల్హోత్రాను ఎవరు హత్య చేశారు? రూహి తండ్రి ఎవరు? అలీషా నేపథ్యం ఏమిటి? అనే ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ కథ మలుపులు తీసుకుంటుంది.

4వ ఎపిసోడ్ నుంచి కథలో ఉత్సాహం తగ్గుతుంది. ఫ్యామిలీ నేపథ్యంలోని సీన్స్ తో సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ‘రూహి’ క్యారెక్టరైజేషన్ కూడా తేడా కొట్టేస్తుంది. హీరోతో కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటే బాగుంటుందనుకుని ఆమె పాత్రను అలా మార్చారని అనిపిస్తుంది. ఇక ఆమె పాత్ర తీరుతెన్నులను ప్రత్యక్షంగా చూస్తూ కూడా, నిన్నే పెళ్లి చేసుకుంటాను.ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అనే ఓంకార్ పాత్రపై కూడా ప్రేక్షకులకు జాలి కలుగుతుంది.
మైనస్ పాయింట్స్:
హాస్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చూసినా, పెద్దగా పని చేయలేదు.స్క్రీన్‌ప్లే లోపాలతో కథ మధ్యలో నత్తనడకన సాగుతుంది.‘ఊప్స్ అబ్ క్యా’లో కొన్ని ఆకర్షణీయమైన ట్రాకులు ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే బలహీనతలు కథను అంతగా మెప్పించలేకపోయాయి. ఆసక్తికరంగా మొదలైన కథ, మధ్యలో నెమ్మదించి కొంత ఊహించదగిన మలుపులతో ముగుస్తుంది. కాస్త పేసింగ్ మెరుగుపరిస్తే ఇంకా బాగుండేది.