మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ

On the third day, muddapappu bathukamma
On the third day, muddapappu bathukamma
On the third day, muddapappu bathukamma

హైదరాబాద్‌: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో రోజు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకుంటారు. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు మొదలవగా రెండో రోజు అటుకుల బతుకమ్మతో మహిళలు ఆడిపాడారు. ఇక ఈరోజు (శుక్రవారం) మూడో రోజు ముద్దబతుకమ్మను పేరుస్తారు మహిళలు. రెండో రోజున బతుకమ్మను రెండు వరుసలతో పేర్చిన మహిళలు.. మూడో రోజు మూడు వరుసల ఎత్తులో బతుకమ్మను సిద్ధం చేస్తారు. ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు ముద్దపప్పు బతకమ్మను శిఖరం ఆకారంలో పేరుస్తారు.

అలాగే బతుకమ్మతో పాటు పసుపుతో తయారు చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఈ బతుకమ్మ కోసం చామంతి, మందారం పువ్వులతో పాటు పలురకాల పువ్వులను కూడా పేరుస్తారు. అలాగే ఈరోజు ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. సాయంత్రం వేళ ఆరుబయట వాకిలిని శుభ్రం చేసి ముగ్గులు వేసిన తర్వాత బతుకమ్మ అక్కడ ఉంచుతారు. తోటి మహిళలు, పిల్లలతో కలిసి పాటలు పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతారు. అనంతరం మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే చిన్నారులకు ముద్దపప్పును, పాలు, బెల్లాన్ని ప్రసాదంగా పంచిపెడతారు. ఆపై బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తుంటారు.

ఈ బతుకమ్మ పండుగలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు అడుగడునా వెల్లువిరుస్తాయి. బతుకమ్మ సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బతుకమ్మ పాటలు పాడి ఆటలు ఆడుతూ బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. తీరొక్క పువ్వులతో పేర్చిన బతుకమ్మను ఓ చోట చేర్చి వాటి చుట్టూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఆ తరువాత బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. ముద్దపప్పు బతుకమ్మను నిమజ్జనం చేసిన తర్వాత మరునాడు జరిగే నానే బియ్యం బతుకమ్మను పేర్చేందుకు సిద్ధమవుతారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. ఈ రోజుల్లో ఆడపడుచులు అందరూ అత్తవారింటి నుంచి కన్నవారింటికి చేరుకుని ఈ పూల పండుగ జరుపుకోవటానికి తయారవుతారు. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలు చేసి, ప్రతీ సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడుతారు. ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో నిమజ్జనం చేస్తారు. ఈ పూల పండుగ తెలంగాణ మహిళలకు ప్రత్యేకమైన పండుగ. ఒక్కో రోజు ఒక్కో పేరుతో బతుకమ్మను వివిధ రకాల పూలతో త్రికోణంలో పేర్చుతారు. తంగేడు పువ్వు, గునుగు పువ్వును ప్రత్యేకంగా బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు.

మరోవైపు దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజుకు శరన్నవరాత్రి ఉత్రవాలు చేరుకున్నాయి. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు క్యూకట్టారు. ఒక్కో ఆలయంలో ఒక్కో రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంటారు. నిన్నటి (బుధవారం) నుంచి మొదలైన దేవీనవరాత్రి ఉత్సవాలు తొమ్మిదిరోజుల పాటు జరుగనున్నాయి.