కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన మంత్రి, సీనియర్ బీజేపీ నేత నితిన్ గడ్కరీ తాజాగా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. “కులం పేరెత్తితే కొడతా” అంటూ గడ్కరీ ఓ సభలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న కుల రాజకీయాలను తప్పుబడుతూ, వ్యక్తి విలువను కులం, మతం, భాష, లింగం ఆధారంగా నిర్ణయించకూడదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
నాగ్‌పూర్‌లోని సెంట్రల్ ఇండియా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వార్షిక స్నాతకోత్సవంలో కేంద్ర రహదారులు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తన ప్రసంగంలో సమానత్వం, సమగ్రాభివృద్ధిపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే, దేశంలో రాజకీయ నాయకులు కుల, మత రాజకీయాలను ప్రోత్సహిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి విలువను నిర్ణయించే అంశం అతని కులం, మతం, భాష, లింగం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. వ్యక్తి యొక్క నిజమైన విలువ అతని ప్రవర్తన, కృషి, ప్రతిభ, విలువలు ఆధారంగా నిర్ణయించాలి. కానీ, కులం పేరుతో ప్రజలను విభజించేలా కొన్ని రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన ప్రవర్తన అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్కరీ తన గత అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఓ ఆసక్తికరమైన సంఘటనను వెల్లడించారు. నేను ఓ 50 వేల మంది హాజరైన సభలో కులం గురించి మాట్లాడితే వారిపై కాలితో తంతానని చెప్పాను. నా మాటలకు అప్పుడు అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. కానీ, ఇది నిజం. మనం కులాన్ని ప్రోత్సహించడం ఆపాలి. అంటూ గడ్కరీ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, తన మాటల వల్ల రాజకీయంగా నష్టపోవచ్చని తన స్నేహితులు సైతం హెచ్చరించినట్లు వెల్లడించారు. నాకు నష్టమే అయినా సరే, నేను కుల రాజకీయాలను మదించడం లేదు. నా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా. కుల రాజకీయాలు, విభజన రాజకీయాలు నా ఓట్లను కోల్పోయేలా చేసినా నేను వాటిని ప్రోత్సహించను అని గడ్కరీ స్పష్టం చేశారు.
భారతదేశంలో కుల రాజకీయాలు సుదీర్ఘ చరిత్ర కలిగివున్నాయి. ఎన్నికల సమయంలో, ప్రధాన పార్టీలన్నీ కులాన్ని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల్లో కులాల ప్రాధాన్యత – కుల సమీకరణాలు, కులగణాంకాలను బట్టి టిక్కెట్లు పంపిణీ చేయడం జరుగుతోంది. ప్రత్యక్ష, పరోక్ష వివక్ష – కొన్ని కులాలకు రాజకీయంగా అనుకూలమైన పథకాలు అమలు చేయడం, మరికొన్ని వర్గాలను పక్కన పెట్టడం జరుగుతోంది. నిరుద్యోగం, సామాజిక అసమానతలతో పెరుగుతున్న విభేదాలు – కుల వ్యవస్థ మూలంగా సామాజిక అసమానతలు పెరిగిపోతున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన “కులం పేరెత్తితే కొడతా” వ్యాఖ్యలు కుల రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించాయి. ప్రజాస్వామ్యంలో, అభివృద్ధిలో కులం అనే అంశం ప్రాముఖ్యత కలిగి ఉండకూడదని ఆయన తేల్చి చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఎంతవరకు రాజకీయంగా ప్రభావం చూపుతాయో వేచిచూడాలి. కుల ఆధారిత గుర్తింపు రాజకీయాల్లో గణనీయమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ, అది తన ఓట్లు పొగొట్టినప్పటికీ తాను అలాంటి వాటికి దూరంగా ఉంటానన్నారు.