తమిళనాడు ఎన్నికల రాజకీయం ప్రస్తుతం హామీల వర్షంతో తడిసిముద్దవుతోంది. అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే (AIADMK) అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఏకంగా 297 అస్త్రాలను సంధించి ఓటర్లను ఆశ్చర్యపరిచారు. ఈ మేనిఫెస్టోలో ప్రకటించిన వరాలు చూస్తుంటే, తమిళ ప్రజలు కేవలం ఓటేస్తే చాలు, మిగిలిన బాధ్యత అంతా ప్రభుత్వానిదే అన్నట్లుగా ఉంది. ప్రతి ఇంటికి ఒక ఉచిత ఫ్రిడ్జ్, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరియు మహిళా యజమానులకు నెలకు రూ. 2,000 నేరుగా నగదు బదిలీ వంటి భారీ హామీలు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా, పెళ్లి కానుకగా మంగళసూత్రం కోసం బంగారం, ఆర్థిక సాయం వంటి పథకాలతో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పళనిస్వామి గట్టి ప్రయత్నమే చేశారు.
Read Also : Nara Lokesh: మంగళగిరిలో 85వ రోజు ‘ప్రజాదర్బార్..సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అడుగులు!

ఫ్రీ..ఫ్రీ
కేవలం గృహిణులకు మాత్రమే కాకుండా, పురుషులు మరియు యువతకు కూడా అన్నాడీఎంకే వరాల జల్లు కురిపించింది. పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 2,000 భృతి, మరియు విద్యార్థులకు ఉచిత ట్యాబ్లెట్ల పంపిణీ వంటి హామీలు మేనిఫెస్టోలో చోటు చేసుకున్నాయి. అయితే, అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ‘సంపూర్ణ మద్యపాన నిషేధం’. గతంలో పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం కూడా ఇదే తరహా హామీ ఇచ్చి, ఆ తర్వాత అమలులో విఫలమైందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, పళనిస్వామి దశలవారీగా మద్యం దుకాణాలు మూసివేస్తామని చెప్పడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ వంటి ఉద్యోగ వర్గాల డిమాండ్లను కూడా ఇందులో చేర్చడం విశేషం.
రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నిధులు
అయితే, ఈ 297 హామీల అమలుపై ఇప్పుడు సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో పథకాలను అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి, మరి ఆ నిధులు ఎక్కడి నుండి తెస్తారనే దానికి స్పష్టమైన సమాధానం లేదు. ఇవన్నీ కేవలం ఓట్ల వేటలో భాగంగా ఇచ్చే ఆచరణ సాధ్యం కాని హామీలని కొందరు విశ్లేషిస్తుంటే, ప్రజలు కూడా వీటిని ఆశల పల్లకిలో విహరించే ముచ్చటగానే చూస్తున్నారు. మరోవైపు డీఎంకే (DMK) మరియు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీలు ఇంకా తమ పూర్తిస్థాయి మేనిఫెస్టోలను ప్రకటించాల్సి ఉంది. అన్నాడీఎంకే ఇచ్చిన ఈ ‘మెగా’ ఆఫర్లకు పోటీగా వారు ఇంకెలాంటి విచిత్రమైన హామీలతో వస్తారో వేచి చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :