హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే పర్సనల్‌గా కలిసి బీజేపీలోకి ఆహ్వానిస్తా అని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కిషన్ రెడ్డి పై రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అసలు తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో ఎవరైనా సఖ్యతగా ఉండాల్సిందే అని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ నేతలు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు. గొప్పలకు పోయి గ్యారంటీలు ప్రకటించి.. ఇప్పుడు తిప్పలు పడుతున్నారని విమర్శించారు. హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు.

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదు
ఇదిలా ఉండగా.. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారు. తెలంగాణలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారు. వరంగల్ ఎయిర్ పోర్టు ఇచ్చింది ప్రధాని మోడీ కానీ ఎయిర్ పోర్టును తానే తెచ్చానని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి మెట్రో విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కు కిషన్ రెడ్డి ఎందుకు నిధులు తీసుకురావడం లేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మరి దక్షిణభాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా పదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది. దీన్ని ఆపింది ఎవరు?, తన కంటే చిన్నోడు సీఎం అయ్యాడని కిషన్ రెడ్డికి కడుపుమంట అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.