ఆగ్రా: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు తన సతీమణితో కలిసి మంగళవారం తాజ్‌మహల్ ను సందర్శించారు. తాజ్‌మహల్ ముందు ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఆయన ప్రత్యేక విమానంలో ఆగ్రా చేరుకోగానే ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉధ్యాయ్ వారికి స్వాగతం పలికారు. కాగా ముయిజ్జు తాజ్‌మహల్‌ను సందర్శించే సమయంలో ప్రజలకు రెండు గంటలపాటు లోపలికి వెళ్లడానికి అనుమతి ఉండదని ఆగ్రా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ప్రకటించిన విషయం తెలిసిందే.
నాలుగు రోజుల ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ముయిజ్జు సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతస్థాయిలో సమాలోచనలు జరిపారు. భారత్, మాల్దీవుల బంధం శతాబ్దాల నాటిదని మోదీ పేర్కొన్నారు. ప్రతీ సంక్షోభంలోనూ ఆ దేశానికి తొలుత ఆపన్నహస్తం అందిస్తున్నది ఢిల్లీయేనని గుర్తుచేశారు.
మాల్దీవులకు తాజాగా 40 కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. భారత్ సహకారంతో మాల్దీవుల్లోని హనిమధూ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా నిర్మించిన రన్‌వేను ముయిజ్జు, మోడీ సంయుక్తంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మాల్దీవుల్లో ఓడరేవులు, రోడ్డు నెట్వర్కులు, పాఠశాలలు, గృహ ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించేందుకు భారత్ తాజాగా ముందుకొచ్చింది. కాగా తమ దేశంలో పర్యటించాలని ముయిజ్జు మోదీని కోరగా దానికి ఆయన సానుకూలంగా స్పందించారు.