హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎదుట వర్చువల్‌గా ఈరోజు హాజరుకాబోతున్నారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్‌పై జడ్జి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. గత విచారణ సందర్భంగా ప్రతివాదులకు సీబీఐ అందజేసిన ఛార్జ్‌షీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
తమకు అందజేసిన చార్జ్‌షీట్ కాపీల్లో చాలా పేజీలు బ్లాంక్‌గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. సరైన డాక్యుమెంట్స్ సప్లై చెయ్యాలని సీబీఐని రౌస్ అవెన్యూ కోర్ట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు (శనివారం) అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరుకాబోతున్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో గత 2 ఏళ్లుగా జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు, కొన్ని నెలలు జైలు జీవితం గడిపిన ఎమ్మెల్సీ కవితకు కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా కొన్ని రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.