తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పదిమంది రహస్యంగా సమావేశమైన వార్త శనివారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాయకత్వం వహించారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ విషయంపై ఆయన స్పందించారు. మా సమావేశం వాస్తవమే, కానీ అందులో ఎటువంటి రహస్యం లేదు అని క్లారిఫై చేశారు. రహస్యంగా సమావేశం కావాల్సిన అవసరం తమకు లేదని ఆయన స్పష్టం చేశారు.అనిరుధ్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, తన వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపిస్తే నేను తట్టుకోను అని హెచ్చరించారు. తాజాగా, ఆయన మీడియాతో మాట్లాడుతూ, నేను రెవెన్యూ మంత్రి వద్ద ఏ ఫైలు పెట్టలేదని చెప్పారు.
నాకు పెట్టానని చెప్పిన ఫైల్ గురించి నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవిని అడగాలని అన్నారు.ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించడంలో తప్పేముంది అంటూ అనిరుధ్ రెడ్డి ప్రశ్నించారు.అయితే, పార్టీ అధిష్టానానికి చెబుతూ చాలా విషయాలు చెప్పాల్సి ఉంది అని కూడా తెలిపారు. ఆయన ప్రస్తావించిన విషయాలపై త్వరలో పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి దీపాదాస్ మున్షి తో సమావేశమై చర్చించవచ్చని తెలిపారు.
ఇక, ప్రభుత్వ నిధుల కేటాయింపు విషయంలో కొంతమంది ఎమ్మెల్యేలు అన్యాయం ఎదుర్కొంటున్నారని ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులు వెళ్ళిపోతున్నాయని, తమ నియోజకవర్గాలకు ఏం కేటాయించలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ వార్తలు వచ్చాయి.ఈ విషయంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి ఫోన్ చేసి ఈ సమావేశం కేవలం లంచ్ మీటింగ్ మాత్రమేనని ఆయనతో వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.