అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. దానిపైనే నా తొలి సంతకం: కమలా హారిస్

If elected president.. my first signature on it: Kamala Harris

వాషింగ్టన్ : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలోని వలసల వ్యవస్థపై ఉపాధ్యక్షురాలు రిపబ్లికన్ అభ్యర్థి కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

‘అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ సమస్య ప్రధానమైనది. ఈ సమస్య పరిష్కారంపై మేం దృష్టిసారించాం. అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఈ వలసల వ్యవస్థను సరిచేసే బిల్లుపై సంతకం చేస్తాను. ఈ బిల్లులో వలసల సమస్య పరిష్కారానికి వనరులు పెంచడం, ఎక్కవమంది న్యాయమూర్తులను నియమించడం, జరిమానాలు కఠినతరం చేయడం వంటి అంశాలు ఉంటాయి. సరిహద్దులను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్‌లోని సంప్రదాయ సభ్యులతో సహా ద్వైపాక్షిక ప్రయత్నానికి మద్దతుగా 1,500 మంది బోర్డర్ ఏజెంట్లను నియమిస్తాం. ఇది అక్రమ వలసలను నియంత్రించడంతో పాటు, సరిహద్దుల వెంబడి దేశంలోకి వస్తున్న మాదక ద్రవ్యాలను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది. మరో 20 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఈ సమస్యను పరిష్కరించగలిగే అధ్యక్షుడు ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు’ అని హారిస్‌ పేర్కొన్నారు.

ఇటీవల కమలాహారిస్ యూఎస్- మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఆ సమయంలో అక్రమ వలసలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తానని ఆమె వ్యాఖ్యానించారు. అయితే హారిస్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకువెళ్లని హారిస్‌కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేశారు. హింసాత్మక మూకలు అమెరికాలో ప్రవేశించి ఇక్కడ హత్యలు, అత్యాచారాలు చేస్తున్నా పదవిలో ఉండి పట్టించుకోలేదని మండిపడ్డారు. చిన్న పట్టణాలను ఆమె శరణార్థి శిబిరాలుగా మార్చేశారంటూ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *